Bunkers | జమ్మూ, మే 2: సరిహద్దు అవతలి నుంచి కాల్పుల తీవ్రత పెరిగిన పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా తమ సామూహిక, వ్యక్తిగత బంకర్లను సరిహద్దు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017లో 14,460 సామూహిక, వ్యక్తిగత బంకర్ల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. సంబా, కథువా, జమ్ము, పూంచ్, రాజౌరీ జిల్లాలో 8,600కిపైగా సాహూహిక, వ్యక్తిగత బంకర్ల నిర్మాణం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఐబీ వెంబడి ఉన్న ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలో పంటల కోతలు పూర్తి కాగా కథువా, సంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాలలో మాత్రం ఇంకా జరుగుతున్నాయి. ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని కోత పనులు పూర్తి చేయాలని సైన్యం రైతులను కోరినట్లు ఒక అధికారి తెలిపారు.
జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి పాకిస్థానీ దళాలు వరుసగా ఎనిమిదో రోజూ కవ్వింపు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారతీయ సైన్యం సమర్థంగా తిప్పికొట్టినట్లు గురువారం అధికారులు వెల్లడించారు. ఎల్ఓసీ, ఐబీ వెంబడి సమీపంలో నివసించే గ్రామస్థులు పాక్ కాల్పుల నుంచి స్వీయ రక్షణ నిమిత్తం తమ బంకర్లను శుభ్రం చేసుకునే పనికి ఉపక్రమించారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్ నౌషేరా, అఖ్నూర్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయని జమ్ములో రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్, పాకిస్థాన్‌కు చెందిన డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓస్) మధ్య ఇటీవల హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిగిన తర్వాత పాక్ నుంచి ఈ తరహా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరగడంపై భారత్ హెచ్చరించింది.
పాక్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)లో వెయ్యికిపైగా మదర్సాలను 10 రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారత్‌తో యుద్ధ భయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.