భుజ్, మే 26: పాక్ ప్రభుత్వం, సైన్యం తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. తమ జీవితాలను నాశనం చేస్తున్న ఈ ఉగ్రవాదం ముప్పును అంతం చేయడానికి పాక్ ప్రజలు కలిసిరావాలని కోరారు. మంగళవారం గుజరాత్‌లోని భుజ్‌లో ఏర్పాటుచేసిన ఓ సభలో ప్రధాని ప్రసంగిస్తూ, పాక్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘నేను పాకిస్థాన్ ప్రజల్ని ఒక విషయం అడగదల్చుకున్నా. మీరు ఏం సాధించారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారు మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ఉగ్రవాదం మీ పాలకులు, సైన్యానికి డబ్బు సంపాదించే మార్గం. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాక్ ప్రజలు ముందుకు రావాలి’ అని అన్నారు.