Ramdev Baba : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రక్తతలు కొనసాగుతున్న వేళ యోగా గురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అంతర్గత ఘర్షణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తనంతట తానే విచ్ఛిన్నమవుతోందన్నారు. బలూచ్ (Balochistan) ప్రజలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారని, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు.
పాకిస్థాన్‌కు పోరాడే శక్తి లేదని, భారత్‌తో యుద్ధం జరిగితే ఆ దేశం నాలుగు రోజులు కూడా ఎదురు నిలువలేదని బాబా ఎద్దేవా చేశారు. మరికొన్ని రోజుల్లో మనం కరాచీ, లాహోర్లలో గురుకులాలను నిర్మించాల్సి ఉంటుందని భావిస్తున్నట్లు రాందేవ్ బాబా చెప్పారు. పొరుగుదేశం తన సైన్యంపై విశ్వాసం కోల్పోయిందని, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేసే ప్రతీకార దాడుల గురించి ఆ దేశ నాయకులు భయపడుతున్నారని విమర్శించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి పాకిస్థాన్‌పై విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదులను పోషిస్తున్న శత్రు దేశంపై భారత్ ఇంకా పూర్తిస్థాయిలో స్పందించలేదని అన్నారు. అలాచేస్తే వారిని ప్రోత్సహిస్తున్నవారు కూడా మిగిలేవారు కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పారు.
కాగా పహల్గాం దాడి తర్వాత పాక్‌పై భారత్ తీసుకుంటున్న చర్యలతో ఆ దేశం తీవ్ర భయాందోళనలకు గురవుతోందని, భారత్‌తో యుద్ధం మొదలైతే పాకిస్థాన్ వద్ద శతఘ్ని గుండ్లు కేవలం నాలుగు రోజుల్లో ఖాళీ అయిపోతాయని ఇటీవల ఓ ఆంగ్ల వార్త సంస్థ తన కథనంలో పేర్కొంది. ఆ దేశం వద్ద ప్రస్తుతం అతి తక్కువ స్థాయిలో శతఘ్నుల నిల్వలు ఉన్నట్లు తెలిపింది.
ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తన యుద్ధ రిజర్వులను చాలావరకు ఉక్రెయిన్‌కు విక్రయించడంతో దాయాది వద్ద నిల్వలు పడిపోయాయని, ప్రస్తుతం ఉన్నవి కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని ఓ నివేదిక వెల్లడించినట్లు తెలుస్తోంది. దాంతో సన్నిహిత దేశాల మద్దతు కూడగట్టుకునేందుకు పాక్ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్‌కు సమచారం ఉంది.
మరోవైపు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుండంతో భారత్ ఏ క్షణమైనా ఎదురుదాడి చేయవచ్చని పాకిస్థాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సముద్రమార్గంలోనూ దాడిచేసే అవకాశం ఉన్నందున తుర్కియేను సంప్రదించి గస్తీ నౌకను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.