హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత్‌తో యుద్ధం గెలువలేవని తెలిసిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ మానసికంగా తృప్తి పొందుతున్నది. భారత్ దాడి చేస్తుంటే పాక్ ఆర్మీ ఏం చేస్తున్నదని, నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదా? అంటూ పాకిస్థాన్ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాక్ రక్షణ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో పరువు నిలబెట్టుకునేందుకు పాక్ దుష్ర్పచారాన్ని నమ్ముకున్నది. బుధవారం భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాత ఫొటోలను పోస్ట్ చేస్తూ భారత్‌కు చెందిన ఫైటర్ జెట్లను కూల్చేశామంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. పాక్‌కు చెందిన మీడియా సంస్థలు సైతం ఐదు భారత విమానాలను కూల్చామంటూ కథనాలు వండి వార్చాయి. అయితే ఇదంతా ఉత్తిదే అని స్వయంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నారు. మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్‌ను గురువారం అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్లో జరిగిన ఓ చర్చలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆ రిపోర్టర్.. ‘భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్తున్నారు. ఇందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి’ అని ప్రశ్నించారు. దీంతో పాక్ మంత్రి కంగుతిన్నారు. ‘అంతా సోషల్ మీడియాలోనే ఉన్నది. ఫొటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. నేను కూడా అక్కడే చూశాను’ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ‘అధికారికంగా ఏమైనా ఆధారాలు చూపెడతారా?’ అని విలేకరి ప్రశ్నించగా పాక్ మంత్రి నీళ్లు నమిలారు. దీంతో పాక్ చేస్తున్నదంతా ఒట్టి ప్రచారమని, కేవలం పరువు నిలబెట్టుకోవడానికే తమ దేశ పౌరులను తప్పుదోవ పట్టించేలా దుష్పచారం చేస్తున్నదని అర్థం అవుతున్నది. మరోవైపు ఈ దుష్ర్పచారం కొనసాగుతూనే ఉన్నది. భారత్ ప్రయోగించిన 25 డ్రోన్లను తాము కూల్చివేశామని, ఇవి ఇజ్రాయెల్‌లో తయారయ్యాయని గురువారం ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మరోసారి విమర్శలు మొదలు పెట్టారు. భారత్ ఇంకా దాడి చేయలేదు.. మరి డ్రోన్లు ఎలా కూల్చారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫైటర్ జెట్ల శకలాల మాదిరిగానే పాత, ఫేక్ ఫొటోలు పెట్టి ప్రచారం చేసుకుంటారా? అంటూ మండిపడుతున్నారు.