SCO | షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు రావాలని ఆ దేశం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించింది. ఈ ఏడాది ఇస్లామాబాద్‌లో సమావేశం జరుగనున్నది. ఈ భేటీకి షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల అధినేతలు భేటీకి హాజరుకానున్నారు. అయితే, భారత్-పాక్ మధ్య ప్రస్తుత సంబంధాల నేపథ్యంలో ప్రధాని పాక్‌కు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధాని ఇస్లామాబాద్ పర్యటకు వెళ్తారా..? ఆయన తరఫున ఎవరైనా మంత్రులను పంపిస్తారా? అనేదానిపై వేచి చూడాల్సిందే. ఎస్సీవో సమావేశం అక్టోబర్ 15-16 తేదీల మధ్య జరుగనుండగా.. భేటీకి పాక్ ఆతిథ్యం ఇస్తున్నది. సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సభ్య దేశాలకు అవకాశం ఉంటుంది.
ఇందులో భాగంగా ఈ సారి ఆతిథ్యమిచ్చే బాధ్యత పాక్‌కు దక్కింది. ఇంతకు ముందు కజకిస్థాన్‌లో జరిగిన సమావేశానికి ప్రధాని దూరంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భేటీకి దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. పాకిస్థాన్‌లో జరిగే సమావేశంలో నేతలకు వర్చువల్‌గా ప్రసంగించే వెసులుబాటు కల్పిస్తారా? లేదా? అన్న విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్సీవోలో చైనా, రష్యా, భారత్‌తో పాటు పాక్ సభ్యులు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌పై చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. చైనా తన బీఆర్ఐ (Belt and Road Initiative) ప్రోత్సాహం కోసం ఈ వేదికను ఉపయోగిచుకుంటున్నది.
ఈ చైనా ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇవ్వడం లేదు. గతేడాది సైతం ఎస్సీవో సంయుక్త ప్రకటనలోనూ బీఆర్ఐ ప్రస్తావనకు భారత్ అనుమతించలేదు. అయితే, భారతదేశం-పాకిస్తాన్ కలిసి పనిచేసే ఏకైక బహుపాక్షిక సంస్థ ఎస్సీవో. ఇది శాశ్వత ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడం దీని లక్ష్యం. 2001 సంవత్సరంలో ఎస్సీవో ఏర్పాటు కాగా.. 2003లో అమలులోకి వచ్చింది. ఈ సంస్థ లక్ష్యం సభ్య దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సద్భావనను బలోపేతం చేయడం. రాజకీయాలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, సాంకేతికత, సంస్కృతి రంగంలో సమర్థవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడం. విద్య, ఇంధనం, రవాణా, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ మొదలైన రంగాల్లో సంబంధాలను మెరుగుపరచడం. సంబంధిత ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని నిర్ధారించడం. ఇందులో చైనా, రష్యా, భారతదేశం, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.