Rajnath Singh : భారత్‌పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని, ఇండియాపై పాకిస్తాన్ ఎలాంటి కుట్రలకు తెరతీసినా.. భారత్ నిర్ణయాత్మక చర్యలకు దిగుతుందన్నారు.
కేరళలో గురువారం జరిగిన సైనిక్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదన్నారు. యూరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్, పుల్వామా దాడి తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్.. ఇలా పాక్ దాడిచేసిన ప్రతిసారి గట్టి సమాధానం ఇచ్చాం అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు మరణించారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్ తాజాగా పాకిస్తాన్‌పై చేసిన ఆరోపణలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
పాకిస్తాన్ ఏదైనా కుట్రకు పాల్పడబోతుందని సమాచారం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. పాక్ ఎలాంటి ప్రయత్నం చేస్తోందనేదానిపై రాజ్‌నాథ్ సింగ్ క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల ఇండియాపై పాకిస్తాన్ కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీలో పట్టుబడిన పాకిస్తానీయులను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్‌పై ఇండియా ఏదో ఆపరేషన్ ప్లాన్ చేస్తున్నట్లుందని అక్కడి మీడియా ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్ని పాక్ చూపలేకపోయింది.