న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు నీటి కష్టాలు మొదలయ్యాయి. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారం చీనాబ్ నది(Chenab River)పై నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నది. దీంతో ఈసారి పాకిస్థాన్ ఖరీఫ్ సీజన్‌కు తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. ఒక్కసారిగా నీటిని ఆపేయడంతో.. పాకిస్థాన్ ఖరీఫ్ సీజన్ పంట దెబ్బతీనే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నది. సుమారు 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాకిస్థాన్‌లోని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ పేర్కొన్నది. పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది.
చీనాబ్ నదిపై ఉన్న సలాల్, బాగ్లిహర్ డ్యామ్‌ల గేట్లను ఇండియా మూసివేసింది. దీంతో నదీ ప్రవాహంలో నీటి స్థాయి దారుణంగా పడిపోయింది. దీని వల్ల పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడనున్నది. ఉగ్రవాద దాడి అంశంలో పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పాలన్న ఉద్దేశంతో నీటిని అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. సలాల్ , బాగ్లిహర్ డ్యామ్‌ల మూసివేత తరహాలోనే కిషణ్గంగ డ్యామ్ గేట్లను కూడా మూసివేయాలని చూస్తున్నది.
పాకిస్థాన్‌లోని సియాల్కోట్ ప్రాంతం వద్ద చీనాబ్ నది ఎంట్రీ అవుతుంది. అయితే మరలా హెడ్‌వర్క్స్ డ్యామ్ వద్ద నీటి స్థాయి పడిపోయింది. ఆదివారం 35వేల క్యూసెక్కులు ఉన్న నీరు.. సోమవారం 3100 క్యూసెక్కులకు దిగజారింది. పాకిస్థాన్ అధికారుల ప్రకారం.. ఆ దేశ వ్యవసాయంలో చీనాబ్ నది చాలా కీలకమైంది. ఎందుకంటే ఎక్కువ కెనాల్స్ ఆ నదిపై ఉన్నాయి. యూసీసీ, బీఆర్బీ కెనాల్స్ ఆ నదిపై ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న వ్యవసాయ భూములకు ఈ కెనాల్స్ నీటినే వాడుతారు.
పాకిస్తాన్లో ముందస్తు ఖరీఫ సీజన్ మే నుంచి జూన్ 10 వరకు ఉంటుంది. ఇక ఖరీఫ్ చివరి సీజన్ జూన్ 11 నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇప్పటికే ముందస్తు ఖరీఫ్ సీజన్‌కు 21 శాతం నీటి కొరత ఏర్పడినట్లు పాకిస్థాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.