Kashmir | శ్రీనగర్: ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అంతేకాకుండా కశ్మీర్‌ను అంతర్జాతీయ సమాజంలో ఎత్తి చూపేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతం పర్యాటకులతో కళకళలాడేదని, ఆర్థిక రంగం అభివృద్ధి చెందిందని, పిల్లలు పాఠశాలలకు వెళ్లేవారని, విమానాశ్రయాలలో రోజుకు 50-60 విమానాలు రాకపోకలు సాగించేవని ఆయన చెప్పారు. ఇప్పుడు కశ్మీర్ లోయ అంతా బోసిపోయి ఖాళీగా కన్పిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ విషయంగా చేసిందని వ్యాఖ్యా నించారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ వాటి మధ్య పలు అంశాలకు సంబంధించిన స్పర్థలు అలాగే కొనసాగుతున్నాయని చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన ఊచకోత లోయలోని పరిస్థితులనే పూర్తిగా మార్చివేసిందని ఆయన తెలిపారు. ‘మనం ఊహించని చోట మనం ఉన్నాం.. మనం ఊహించని రక్తపాతంలో బాధలు పడుతున్న చోట మనం ఉన్నాం’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
కాల్పుల విరమణను స్వాగతించిన పోప్
వాటికన్ సిటీ: నూతన పోప్ లియో 14, అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ పాంటిఫ్గా తన తొలి ఆదివారం సందేశాన్ని వినిపించారు. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన కుదరడాన్ని స్వాగతించారు. ఇరు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.