India-Pakistan Tension | ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు సరిహద్దులోని 26 ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడికి తెగబడింది. అయితే పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ డ్రోన్లను కూల్చివేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 100 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలుస్తోంది.
బారాముల్లా, శ్రీనగర్, అవంతిపురా, నాగ్రోటా, జమ్ము, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మేర్, భుజ్, కుర్బేట్, లాఖీ నాలా తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి పాక్ డ్రోన్లతో దాడికి దిగిందని భారత సైన్యం తెలిపింది. భారత సైన్యంతో పాటు సాధారణ పౌరులే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడిందని పేర్కొంది. ఈ ఘటనలో ఫిరోజ్‌పూర్‌లోని పలువురు సాధారణ పౌరులు గాయపడ్డారని మిలటరీ అధికారులు వెల్లడించారు. క్షతగ్రాతులకు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు.
మరోవైపు ఎల్వోసీలోనూ పాకిస్థాన్ కాల్పులకు తెగబడుతోంది.పాక్ దాడుల నేపథ్యంలో జమ్ము నగరవ్యాప్తంగా సైరన్లను మోగించారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా స్పందించారు. తనకూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు. జమ్మూ, పరిసర ప్రాంత ప్రజలు వీధుల్లోకి రావద్దని.. ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వదంతులను పట్టించుకోవద్దని, నిరాధార, ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని చెప్పారు.
కాగా, ముందస్తు చర్యల్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ విధించారు. జమ్మూ డివిజన్లోని ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్అవుట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అఖ్నూర్ జైసల్మేర్, హరియాణాలోని అంబాలా, పంచకుల, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, మోగా, జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.