న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board)కు భారీ నష్టం వచ్చింది. ఐసీసీ టోర్నీ నిర్వహణతో ఆ బోర్డు కష్టాలు మరింత పెరిగాయి. చాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సుమారు 869 కోట్ల నష్టం వచ్చినట్లు ఓ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ఆ టోర్నీలో ఆతిథ్య జట్టు .. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత దుబాయ్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా పరాజయం చవిచూసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మూడవ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయ్యింది. గ్రూప్ స్టేజ్‌లోనే పాకిస్థాన్ టోర్నీ నుంచి నాకౌట్ కావడంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాలను పీసీబీ అప్‌గ్రేడ్ చేసింది. ఆ వేదికల అప్‌గ్రేడ్ కోసం సుమారు 58 మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యింది. అనుకున్న బడ్జెట్ కన్నా 50 శాతం ఎక్కువ బడ్జెట్‌ను ఖర్చు చేశారు. ఈవెంట్ ప్రిపరేషన్ కోసం అదనంగా 40 మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టింది పీసీబీ. అయితే టోర్నీ నిర్వహణ కోసం భారీగా ఖర్చు చేసినా.. ఆ టోర్నీ వల్ల పీసీబీకి వచ్చింది చాలా తక్కువే. టోర్నీని హోస్ట్ చేసినందుకు తమకు కేవలం 6 మిలియన్ల డాలర్లు వచ్చినట్లు పీసీబీ వెల్లడించింది. ఇక టికెట్ సేల్స్, స్పాన్సర్‌షిప్‌లతో వచ్చిన ఆదాయం కూడా మరీ తక్కువే అని పేర్కొన్నది.
ఓవరాల్‌గా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణ వల్ల సుమారు 85 మిలియన్ల డాలర్ల నష్టం వచ్చినట్లు పీసీబీ స్పష్టం చేసింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు కొత్తగా కొన్ని ప్లాన్స్ వేసింది. నష్ట నివారణ చేర్యలు చేపట్టేందుకు సిద్దమైంది. జాతీయ టీ20 చాంపియన్స్‌లో మ్యాచ్ ఫీజును 90 శాతం తగ్గించేందుకు బోర్డు మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఇక రిజర్వ్ ప్లేయర్ పేమెంట్‌ను కూడా 87.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును 40 వేల నుంచి 10 వేలకు తగ్గించినట్లు వస్తున్న వార్తలను పీసీబీ చైర్మెన్ మోషిన్ నఖ్వీ ఖండించారు. బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆటగాళ్లకు కల్పించే 5-స్టార్ సదుపాయాలను మార్చేసి ఎకానమీ క్లాసు హోటల్స్ ఇస్తున్నారు.