న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ..సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. మిషన్ రెడీ..అంటూ శనివారం ఓ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘ఎప్పుడైనా, ఎలాగైనా, దేనికీ భయపడం. ఏదీ మమ్మల్ని ఆపదు. ఎల్లప్పుడు సిద్ధంగానే’ అంటూ జవాన్ల విన్యాసాలను ఆ వీడియోలో చూపించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతి చర్యగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్లో జర్దారీ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సింధూ నది తమ సొంతమని, అది ఎప్పటికీ తమదేనని సింధ్ ప్రావిన్సులోని సుక్కూర్‌లో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ప్రకటించారు. ‘అందులో(సింధూ నదిలో) మా నీళ్లయినా పారుతాయి లేక మీ(భారత్) రక్తమైనా పారుతుంది’ అంటూ ఆయన భారత్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భుట్టో జర్దారీ మధ్య అత్యవసర సమావేశం జరిగింది.
పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ హెచ్చరికలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం తీవ్రంగా స్పందించారు. ఆయన(జర్దారీ) ప్రకటన విన్నానని, నీళ్లు ఎక్కడైనా ఉంటే దూకమని ఆయనకు చెప్పండి అంటూ పూరీ విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు. ‘అయినా నీళ్లే లేకపోతే ఎక్కడ దూకుతాడు?అటువంటి ప్రకటనలు హుందాగా ఉండవు. ఆ విషయాన్ని వాళ్లు కూడా అర్థం చేసుకోవాలి’ అని ఆయన హితవు చెప్పారు.
ఇస్లామాబాద్: పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిపై తటస్థ, పారదర్శక దర్యాప్తులో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ శనివారం వెల్లడించారు. ‘నమ్మదగిన’ దర్యాప్తులో భాగస్వామి కావడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్నారు. నిరంతర నిందారోపణల క్రీడకు మరో ఉదాహరణ ఇటీవలి పహల్గాం విషాదంపై జరుగుతున్న ప్రచారమని చెప్పారు. ఇది ఇక ఇక్కడితో ఆగాలన్నారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఖండిస్తూనే ఉందన్నారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ దర్యాప్తు అధికారులు నిర్వహించే దర్యాప్తునకు సహకరించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని శుక్రవారం చెప్పారు.