ముంబై, సెప్టెంబర్ 14: ఆసియా కప్‌లో ఆదివారం భారత్ క్రికెట జట్టు దుబాయ్‌లో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలు చోట్ల భారత్ విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేయగా, పహల్గాం దాడి తర్వాత తొలిసారిగా పాకిస్థాన్‌తో మన దేశ జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడటం పట్ల పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం దాడి బాధిత కుటుంబాలు సహా పలువురు మాట్లాడుతూ రక్తంతో చేతులు తడిచిన వారితో మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని విమర్శించారు.
పహల్గాం దాడిలో అసువులు బాసిన 26 మంది పౌరుల ప్రాణాల కన్నా ఈ ఆట ద్వారా ఆర్జించే ధనం ఎక్కువా? అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు టీవీలను బద్దలు కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. పలువురు మహిళలు ప్రధాని నరేంద్ర మోదీకి సిందూర్ (కుంకుమ)ను పంపడమే కాక, డబ్బులు లేని బీసీసీఐకు విరాళాలు ఇవ్వాలంటూ కోరారు. కాగా, మ్యాచ్‌ను నిలిపివేయాలంటూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లాయీస్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది.