Pahalgam Attack | న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో దాడికి పాల్పడి 26 మంది ప్రాణాలు బలితీసుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్లో తలదాచుకున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడి వెనుక మరికొందరు ఉగ్రవాదుల ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
భద్రతా బలగాలు స్పందిస్తే.. వారికి రక్షణ కల్పిస్త్తూ కాల్పులు జరిపే ఉద్దేశంతో సమీపంలో మాటు వేసినట్టు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహారం, ఇతర నిత్యావసర సరుకుల కోసం ఎవరి అవసరం లేకుండా, బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా ఎక్కువ రోజులు ఉండగలిగేలా ముందే అన్నీ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. దాడి సమయంలో ఉగ్రవాదులు సిమ్‌కార్డుతో పనిలేని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించినట్టు తెలిసింది.