Pahalgam attack : పహల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్‌ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాదులు (Terrorists) త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఒకసారి మాత్రం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకొన్నాయి. భద్రతా దళాలను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పారిపోయారు.
దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో దళాలు పలు సందర్భాల్లో ఉగ్రవాదులకు అత్యంత దగ్గరగా వెళ్లాయని ఓ జాతీయ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల లొకేషన్లను గుర్తిస్తున్నది. ‘ఉగ్రవాదులు మా కనుచూపు మేరలోకి వచ్చినా కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. ఉగ్రవాదులు మనకు కనిపిస్తున్నా వారేనా కాదా అని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులను పట్టుకొని తీరతాం. వాళ్లకు ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది’ అని ఓ సైనిక అధికారి వ్యాఖ్యానించారు.
భద్రతా బలగాలు ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. కానీ దళాలు అక్కడికి చేరేలోపు అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకొన్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం తిరిగి త్రాల్ కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి వారు జారుకొన్నాక కొకెర్నాగ్లో లొకేషన్ బయటపడింది. ఉగ్రవాదులు ప్రస్తుతం కొకెర్నాగ్ చుట్టుపక్కలే ఉండొచ్చని భావిస్తున్నారు.
ఓ గ్రామంలోని ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకోవడంతో.. ఆహారం తీసుకొని వారు పారిపోయినట్లు సైనికాధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు తమకు అవసరమైన నిత్యావసరాల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వీరు గ్రామాల సమీపంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్థానిక సహాయకులను సంప్రదించి అడవుల్లోకి ఆహారం తెప్పించుకొంటారు. ఆ సమయంలో దళాలకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ లభిస్తుంది. కానీ వీరు చాలా అప్రమత్తంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ఉగ్రవాదులు కిష్ట్వార్ ప్రాంతంలోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు సమస్యలు రావొచ్చు. ఎందుకంటే ఇక్కడి పర్వతాలు పహల్గాం వైపు శిఖరాలతో కలిసి ఉంటాయి. తక్కువ మంచు ఉండటంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి దట్టమైన అడవులు ఉన్న జమ్మూ ప్రాంతంలోకి ప్రవేశించడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు పహల్గాం చుట్టుపక్కల అడవులను జల్లెడ పడుతున్నారు.