Pahalgam attack : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు అప్పగించింది. కేంద్ర హోంశాఖ (MHA) ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది.
ఉగ్రవాదుల దాడి మరుసటి రోజు నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.
పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశామని తెలిపారు. బైసరన్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలుసుకొని తొలుత సీఆర్పీఎఫ్ (CRPF) క్విక్ యాక్షన్ టీమ్ స్పందించింది.
మొత్తం 25 మంది కమాండోలతో కూడిన బృందం రాళ్లు, బురద మార్గంలో దాదాపు 40-45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఘటనా స్థలానికి చేరుకుంది. వెంటనే పహల్గాం చుట్టూ సీఆర్పీఎఫ్ యూనిట్ చెక్‌పోస్టులు, ఘటనా స్థలానికి సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటుచేసింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు.