AIMIM Chief : వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వార్తలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించి దాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నదని అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఔన్నత్యం, హక్కులకు భిన్నంగా పార్లమెంట్లో వెల్లడించని విషయాలపై మీడియాకు సమాచారం అందిస్తున్నదని ఓవైసీ మండిపడ్డారు. మీడియా కథనాల ప్రకారం వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించాలని యోచిస్తోందని వెల్లడవుతున్నదని చెప్పారు. బీజేపీ తొలి నుంచీ ఈ బోర్డులకు, వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకమని, కాషాయ పాలకులు హిందుత్వ అజెండాపై పనిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం వక్ఫ్ చట్టానికి సవరణలు చేపడితే నిర్వహణ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వక్ఫ్ బోర్డు ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. వివాదాస్పద ఆస్తులు ఏమైనా ఉంటే బీజేపీ పాలకులు, సీఎంలు వాటిపై సర్వే చేయిస్తామని చెబుతారని, ఆపై వీరి సర్వే ఎటు దారితీస్తుందనేది తెలిసిన విషయమేనని పేర్కొన్నారు.
దేశంలో ఎన్నో దర్గాలు అసలు దర్గాలు, మసీదులు కాదని బీజేపీ-ఆరెస్సెస్ చెబుతున్నాయని అన్నారు. న్యాయవ్యవస్ధ అధికారాలను కార్యనిర్వాహకవర్గం లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఓవైసీ దుయ్యబట్టారు. కాగా, వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వెల్లడయ్యాయి. కాగా, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టానికి దాదాపు 40 సవరస్త్రణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నదని చెబుతున్నారు.
Read More :
Bomb threat | బీహార్ సీఎం ఆఫీస్కు బాంబు బెదిరింపు.. కేసు నమోదు..!