న్యూఢిల్లీ, మే 29: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్, దక్షిణాంచల్ విద్యుత్తు పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్తు కార్మికులు కన్నెర్రచేశారు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, నాగ్‌పూర్, రాయ్‌పూర్, భోపాల్, జబల్పూర్, వడోదర, రాజ్‌కోట్, గువాహటి, షిల్లాంగ్, కోల్‌కతా, భువనేశ్వర్, పాట్నా, రాంచీ, శ్రీనగర్, జమ్ము, శిమ్లా, డెహ్రాడూన్, పాటియాలా, జైపూర్, కోట, హిస్సార్, లక్నో నగరాల్లో 27లక్షల మంది ఉద్యోగులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
ఈ మేరకు అఖిల భారత విద్యుత్తు ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీలోని మొత్తం 75 జిల్లాలకు గాను 42 జిల్లాలకు విద్యుత్తు పంపిణీ చేసే సంస్థలను ప్రైవేటుకు అప్పగించడం సరికాదని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే మండిపడ్డారు. ప్రభుత్వం, విద్యుత్తు అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల డిస్కంల ఆస్తులను నామమాత్రపు ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న తప్పుడు ఒప్పందాల కారణంగా ప్రభుత్వం ఒక్క యూనిట్ విద్యుత్తు కొనుగోలు చేయకుండానే ఏటా రూ.6,761 చెల్లించాల్సిన దుస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేటీకరణతో ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తుతుందని తెలిపారు. యూపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు కొనసాగుతాయని, విద్యుత్తు సరఫరా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించారు.