తిరువనంతపురం: కేరళలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ దశలోనే 24 లక్షలకు పైగా ఓటర్ల ఆచూకీ తెలియరాలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యూ కేల్కర్ శనివారం వెల్లడించారు. సర్ కార్యకలాపాలను సమీక్షించేందుకు నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సర్ గణాంకాలను వివరించారు. రాష్ట్రంలోని మొత్తం 2.78 కోట్ల ఓటర్లలో 24,08,503 ఎన్యూమరేషన్ ఫారాలు వాపసు రాలేదని ఆయన చెప్పారు. వీరిలో 6,49,885 మంది మరణించినట్లు ఆయన చెప్పారు. 6,45,545 మంది ఆచూకీ తెలియరాలేదని అన్నారు.