న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కియేలోని మారుమూల ‘దియార్బకిర్’ విమానాశ్రయంలో ల్యాండింగ్ జరపాల్సి వచ్చింది. దీంతో విమానంలో ఉన్న వందలాది మంది భారతీయ ప్రయాణికులు దాదాపు 16 గంటలకుపైగా ఆ విమానాశ్రయంలో చిక్కుకుపోయారని తెలిసింది. వసతి సహా ఇతర ఏర్పాట్లేవీ లేవని, తమ ప్రయాణం ఎప్పుడన్నది అధికారులు చెప్పటం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్‌లైన్ సంస్థ నుంచి కూడా ప్రయాణికులకు ఎలాంటి సమాచారం అందటం లేదట. వీలైనంత తొందరగా మరో విమానాన్ని తెప్పించి.. తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని విమానాశ్రయ అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు.