న్యూఢిల్లీ : భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలపై ఆధారపడటం పెరుగుతున్నది. 2024లో 13.35 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. టాప్ 5 డెస్టినేషన్లుగా కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ నిలిచాయి. నీతి ఆయోగ్ సోమవారం ‘భారత దేశంలో ఉన్నత విద్య అంతర్జాతీయీకరణ’ శీర్షికతో విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను తెలిపింది.
2024లో కెనడా దాదాపు 4.27 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్‌ను ఆకర్షించి, మోస్ట్ పాపులర్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న అమెరికా 3.37 లక్షల మందిని, బ్రిటన్ 1.85 లక్షల మందిని ఆకర్షించాయి. నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 1.22 లక్షల మంది, ఐదో స్థానంలో ఉన్న జర్మనీకి 43,000 మంది భారతీయ విద్యార్థులు వెళ్లారు.
ఉన్నత విద్యను చదవ గలిగే 18 ఏండ్ల నుంచి 23 సంవత్సరాల వరకు కలవారు మన దేశంలో దాదాపు 15.5 కోట్ల మంది ఉన్నారు. ఈ వయస్కులు ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అయితే, మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న, విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న విద్యార్థుల సంఖ్య అసమతుల్యంగా ఉంది. సగటున 2024లో మన దేశంలో ఒక అంతర్జాతీయ విద్యార్థి చదువుతూ ఉంటే, మన దేశం నుంచి విదేశాలకు 28 మంది వెళ్తున్నారు. 2023-24లో భారతీయులు ఉన్నత విద్య కోసం రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు చేశారు.