Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పటాసుల నిషేధాన్ని పోలీసులు (Delhi police) సీరియస్‌గా తీసుకోలేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. పటాసులపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సంబంధిత వ్యక్తులకు చేరవేసి, ఆ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీల పోలీసులపై ఉందని పేర్కొంది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను సీరియస్‌గా తీసుకుని పటాసులపై నిషేధాన్ని తక్షణమే కచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక లైసెన్సులు లేనివాళ్లు పటాసులు అమ్మకుండా, తయారు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించింది.
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బాణాసంచాపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా నిషేధం సక్రమంగా అమలుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు తాజాగా మళ్లీ ఆదేశాలు ఇచ్చింది.