న్యూఢిల్లీ: భారత్కు చెందిన వలసదారులను తీసుకురావడానికి భారత్ విమానాలను ఎందుకు పంపలేదని మోదీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. 104 మంది కాళ్లు, చేతులకు బేడీలు వేసి అవమానకర రీతిలో అమానవీయంగా భారత్కు తీసుకువచ్చారని, మన పౌరుల పట్ల చూపే మర్యాద ఇదేనా? అని ప్రశ్నించాయి. వారిని అవమానించకుండా మర్యాదగా దేశానికి తీసుకురావడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. పార్లమెంట్ ఉభయసభల్లో గురువారం దీనిపై రగడ జరగింది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ తదితరులు వలసదారుల పట్ల అనుసరించిన అవమానకర వైఖరిని తప్పుబట్టారు.
అక్రమ వలసదారులను బహిష్కరించడం అమెరికా హక్కయినప్పటికీ, వారిని పంపిన విధానాన్ని తాము నిరసిస్తున్నామని కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ బలహీనతను తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తగిన సమయంలో స్పందిస్తుందని, దీనిని రాజకీయం చేయడం విపక్షాలకు తగదని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. సభలో కొందరు సభ్యులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.
రాజ్యసభలోనూ ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరిగింది. సీపీఐ, టీఎంసీ, ఆప్, సీపీఐ(ఎం) ఎంపీలు దీనిపై చర్చకు నోటీసులు ఇచ్చారు. అయితే చైర్మన్ ధన్ఖడ్ వీటిని తిరస్కరించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ మన పౌరులను సంకెళ్లు వేసి తీసుకురావడం మనసు కలిచివేసిందని, మనకంటే ఎన్నో రెట్లు చిన్నవైన కొలంబియా లాంటి దేశాలు తమ విమానాలు అమెరికాకు పంపి తమ పౌరులను గౌరవంగా తమ దేశానికి తీసుకువచ్చాయని, భారత్ ఆ పని ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు. మన పౌరుల ప్రయోజనాలు, గౌరవం కన్నా అమెరికా బహిష్కృత పాలసీని సమర్థించడానికే మంత్రి జైశంకర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కన్పిస్తున్నదని ఆరోపించారు.