న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. దీని కోసం నోటీసు ఇవ్వనున్నట్లు ఇవాళ విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష సభ్యుల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లెఫ్ట్ ఫ్రంట్ ఎంపీ ఎన్కే ప్రేమ్‌చంద్రన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మహిళా విపక్ష ఎంపీలపై కూడా స్పీకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, వారిని సస్పెండ్ చేసినట్లు ప్రేమ్‌చంద్రన్ ఆరోపించారు. ఈ అంశంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆ ఎంపీ వెల్లడించారు.
సభను తమ తొత్తుగా భావిస్తూ నడిపిస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదు అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. వారం రోజుల క్రితం లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. గాల్వాన్ ఘర్షణ గురించి మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో సభలో అప్పటి నుంచి గందరగోళం కొనసాగుతూనే ఉన్నది. అయితే ప్రచురణ కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలు చేయవద్దు అని రాహుల్ గాంధీని స్పీకర్ కోరారు. వాస్తవానికి లోక్‌సభలో విపక్ష సభ్యుల సంఖ్య నామమాత్రమే. కానీ స్పీకర్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు విపక్షాలు చెబుతున్నాయి. లోక్‌సభకు రావొద్దు అని శుక్రవారం ప్రధాని మోదీని తానే చెప్పినట్లు స్పీకర్ బిర్లా పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఇంకా లోక్‌సభలో కొనసాగుతున్నది. రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ఇవాళ కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఉదయం విపక్షాలు ఆందోళన చేపట్టడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
ఇక 2024 డిసెంబర్లో రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కడ్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 14 రోజుల నోటీసు సమయం ఇవ్వకుండా అకస్మాత్తుగా నోటీసు ఇచ్చినందుకు దాన్ని డిప్యూటీ చైర్మెన్ తిరస్కరించారు. ధన్కడ్ పేరును కూడా సరిగా ప్రచురించలేదన్నారు.