న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేట్ల కోతను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇది పాక్షిక కోత మాత్రమేనని, దీన్ని జీఎస్టీ 1.5గా అభివర్ణించింది. పూర్తి స్థాయి జీఎస్టీ 2.0 కోసం నిరీక్షణ కొనసాగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణల గురించి ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. జీఎస్టీ కౌన్సిల్ లాంఛనప్రాయంగా మారిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. తమ రెవెన్యూల రక్షణ కోసం నష్టపరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని రాష్ర్టాలు కోరడాన్ని ఆయన సమర్థించారు. ఈ డిమాండుపై జీఎస్టీ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు.
జీఎస్టీ శ్లాబ్‌లను సవరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కంటితుడుపు చర్యగా తమిళనాడు పారిశ్రామికవేత్తలు అభివర్ణించారు. పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ నిర్ణయం పరిష్కరించడం లేదని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆంత్రప్రెన్యూర్స్ నేషనల్ చైర్మన్ కేఈ రఘునాథన్ తెలిపారు. కార్టన్ బాక్సులు, సోలార్ కుకర్లు, కొన్ని నిర్దిష్టమైన విడి భాగాలపై జీఎస్టీ తగ్గించడం వల్ల కొందరు తయారీదారులకు ఖర్చులు తగ్గుతాయని, కాని రంగాల వారీగా సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం చూపలేదని ఆయన అన్నారు. ప్రత్యేకంగా జౌళి, ఆహార తయారీ, ఇంజనీరింగ్ వంటి ఎంఎస్ఎంఈలను ఈ జీఎస్టీ సంస్కరణలు తాకలేదని ఆయన తెలిపారు. నాలుగు శ్లాబ్‌లను రెండు శ్లాబ్లుగా మార్చడం వల్ల ఒరిగేదేమీ ఉండదని, ఇది కేవలం కంటితుడుపు చర్యే తప్ప సంస్కరణ కాదని ఆయన చెప్పారు.
జీఎస్టీ రేట్ల కోత వల్ల రాష్ర్టాలు తమకు వచ్చే పన్ను ఆదాయాన్ని రూ. 8,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. జీఎస్టీ నూతన సంస్కరణలను అమలు చేసిన తర్వాత రాష్ర్టాలు ఎదుర్కొనే రెవెన్యూ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తామన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని విలేకరుల సమావేశంలో ఒవైసీ ఆరోపించారు. జీఎస్టీ రేట్ల కోత వల్ల రాష్ర్టాల ఆదాయంపై అసమానంగా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. రాష్ర్టాల రెవెన్యూలు, ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే ఈ నిర్ణయం తాము స్వాగతించలేమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని ఆయన చెప్పారు.