న్యూఢిల్లీ: లోక్‌సభలో గత గురువారం ప్రధాని మోదీ ప్రసంగం రద్దయిన తర్వాత విపక్షాలపై పరువు నష్టం ఆరోపణలు చేసినందుకు, విపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు అనుమతించనందుకు ఆయనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. త్వరలోనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ తీర్మానాన్ని అందజేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ తీర్మాన ప్రతిపై వంద మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. తీర్మానంపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాజ్యాంగంలోని అధికరణ 94-సి కింద తీర్మానంపై నోటీస్ ఇవ్వనున్నారు. గత గురువారం ప్రధాని ప్రసంగించడానికి కొన్ని నిమిషాల ముందు విపక్ష సభ్యుల నిరసన కారణంగా లోక్‌సభ వాయిదా పడింది. ప్రధానిని లక్ష్యంగా చేసుకొని విపక్ష ఎంపీలు అనుకోనిది ఏదైనా చేయవచ్చనే సమాచారం తనకుందని.. అందుకే సభకు రావొద్దని తాను ప్రధానికి సూచించానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆ తర్వాత చెప్పడం విపక్షాలకు, ముఖ్య ంగా కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం కలిగించింది.