Congress Govt | బెంగళూరు, మర్చి 2: గ్యారెంటీలంటూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును కొన్ని నెలలుగా బకాయి పెట్టింది. దళితుల సంక్షేమం, అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను కూడా గ్యారెంటీల అమలు కోసం మళ్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై సిద్ధరామయ్య సర్కారు మీద ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దళితుల నిధులను దుర్వినియోగం చేయడంపై మండిపడింది.
అయిదు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దుర్వినియోగం చేస్తున్నదని బీజేపీ ఆరోపిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్, 2013 ప్రకారం రాష్ట్రం మొత్తం బడ్జెట్లో 24.1 శాతం నిధులను ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం వాడాలన్న నిబంధనను ప్రభుత్వం పాటించడం లేదని విమర్శించింది. 2024-25 బడ్జెట్లో రూ.14,730.53 కోట్లను ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచి అయిదు గ్యారెంటీల అమలుకు కేటాయించారు. ఇది గ్యారెంటీల అమలు కోసం కేటాయించిన మొత్తం రూ.52 వేల కోట్ల బడ్జెట్లో 28 శాతం.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దళితుల సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని సీఎం సిద్ధరామయ్యను ఇటీవల దళిత నేతల బృందం కోరింది. ఎస్సీ, ఎస్టీ నిధులను గ్యారెంటీ పథకాలకు మళ్లించొద్దని అభ్యర్థించింది. శాసనమండలి ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు నారాయణస్వామి మాట్లాడుతూ.. ‘గ్యారెంటీలను కులాలకు అతీతంగా ఇస్తున్నారు. లింగాయత్‌లు, వొక్కలిగలు, ముస్లింలు, ఇతర వర్గాలు గ్యారెంటీ నిధుల నుంచి ప్రయోజనాలు పొందుతున్నప్పుడు.. దళితులకు మాత్రం ఎందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి కేటాయిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో, అయిదు గ్యారెంటీలకు సంబంధించిన పథకాల్లోని లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తేల్చడంలో సిద్ధరామయ్య సర్కారు నిమగ్నమైంది. ఈ నెల చివరి నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నెల 7న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం కొన్ని వివరాలు శాసనసభకు వెల్లడించే అవకాశం ఉంది.