Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలను ఆదానీ వ్యవహారం, సంభల్ హింసాకాండ తదితర అంశాలు కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు (INDIA Block) ఆందోళనకు దిగారు. అదానీ వ్యవహారం (Adani matter)పై లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా విపక్ష ఎంపీలంతా నిరసనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు హాజరుకాలేదు.
#WATCH | Delhi: Opposition MPs including Lok Sabha LoP Rahul Gandhi hold a protest over Adani matter, at the Parliament premises.
MPs of TMC and SP are not participating in this protest. pic.twitter.com/fLuS1Jvi3s
— ANI (@ANI) December 9, 2024
ఇండియా కూటమికి బీటలు..!
కాగా, కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల అందులోని పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ‘ఎన్నికల్లో విజయం సాధించి పెట్టలేని నాయకుడిని మనం ఇంకా ఎంతకాలం భరించాలి’ అన్న ధోరణి ఆ పార్టీల్లో ఇటీవల అధికమైంది.
ముఖ్యంగా శివసేన (యూబీటీ), టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు శనివారం మమత చేసిన ప్రకటనపై స్పందించాయి. పరోక్షంగా ఆమెకు మద్దతు తెలిపి, కూటమిలో నాయకత్వ మార్పు చేపట్టాలన్న సంకేతాలు ఇచ్చాయి. దానికి తోడు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కూటమి పరాజయం, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒకే అంశం(అదానీ అవినీతి)పై కాంగ్రెస్ కేంద్రాన్ని నిలదీయడం, అధికార పార్టీ సభను వాయిదా వేయడం తదితర అంశాలు కూటమిలోని మిగతా పార్టీలకు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్‌ను తప్పించాలని కొన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.