న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు లోక్సభలో వీగిపోయిన దరిమిలా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది. అధికారిక జాతీయ ప్రసంగాన్ని ప్రధాని మోదీ పక్షపాత రాజకీయ ప్రసారంగా మార్చివేశారని పలువురు విపక్ష నేతలు ఆరోపించారు. తామేమీ తప్పులు చేయలేదని.. బీజేపీ ప్రభుత్వమే తప్పులు చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించని ఆ పార్టీ అధికారంలోంచి దిగిపోవాలని వారు డిమాండ్ చేశారు. గత 12 ఏండ్లుగా చెప్పుకోదగ్గదేమీ సాధించలేక, నిరాశ నిస్పృహలకు లోనైన మోదీ జాతిని ఉద్దేశించి చేసే అధికారిక ప్రసంగాన్ని బురద జల్లుడు, పచ్చి అబద్ధాలతో నిండిన రాజకీయ ప్రసంగంగా మార్చారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.
తృణమూల్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) ప్రక్రియ, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని ప్రజలను తప్పుదోప పట్టించారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్సభలో ఆమోదింపచేయడంలో విఫలమైన కారణంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించలేదనే విషయం స్పష్టమైందని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అందువల్ల కేంద్రంలో అధికారంలో కొనసాగే హక్కు ఆ కూటమికి లేదన్నారు. ప్రధాని తన ప్రసంగం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని సీపీఐ ఎంపీ పీ సంతోష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు ఆదివారం లేఖ రాశారు. దీనిపై ఈసీఐ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. దూరదర్శన్, సంసద్ టీవీ వంటి ప్రజా వేదికలపై ఆ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి పాల్పడడమేనని ఆయన ఆరోపించారు.