Parliament sessions : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలన్నీ సిద్ధమైపోయాయి. పెగాసస్ వ్యవహారం, వ్యవసాయ ఇబ్బందులు, లద్దాఖ్ వ్యవహారం, చైనా విషయం, ఎయిరిండియా వ్యవహారం, కోవిడ్ బాధితులకు ప్యాకేజీ లాంటి వ్యవహారాలతో పాటు మరికొన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో కలిసి, తాము పార్లమెంట్ వేదికగా అధికార బీజేపీపై పోరాడుతామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా కాంగ్రెస్ చేసే పోరాటంలో కలిసి వస్తామని ప్రకటించలేదు. సోమవారం నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సమావేశాలు సాగుతున్న తరుణంలో అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఏయే పార్టీలు కలిసి వస్తాయన్నది వేచి చూడాల్సిన అంశం. మరోవైపు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి గాను పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం వివిధ పక్షాలతో సమావేశం కానున్నారు. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కూడా రాజ్యసభ సజావుగా సాగే నిమిత్తమై వివిధ పక్షాలతో సమావేశం కానున్నారు.