న్యూఢిల్లీ, జూలై 14: ప్రజల వేషధారణ, భాషలపై ఇప్పటికే నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న మోదీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తమ అసమర్థ పాలనను ఎండగడుతున్న ప్రతిపక్షాల నోటిని కట్టడి చేసేందుకు అనాలోచితంగా ప్రవర్తించింది. పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభసభ్యులు కొన్ని పదాలను వాడకూడదంటూ లోక్‌సభ సెక్రటేరియట్‌తో ఓ బుక్‌లెట్‌ను విడుదల చేయించింది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి.
మోదీ పాలనను ఎలా వర్ణించాలి మరి?
లోక్‌సభ, రాజ్యసభలో ప్రజాప్రతినిధులు వాడకూడదంటూ కొన్ని పదాలను అన్‌పార్లమెంటరీ వర్డ్స్ (మర్యాదలేని పదాలు) జాబితాలో చేర్చుతూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వులపై విపక్షాలు మండిపడ్డాయి. జుమ్లాజీవి, జైచంద్ తదితర పదాలను నిషేధించడాన్ని చూస్తే ప్రధాని మోదీలో దాగున్న భయం ఇప్పుడిప్పుడే బయట వస్తున్నదని కాంగ్రెస్ పేర్కొంది. నవ్య భారత్‌కు సరికొత్త డిక్షనరీ అంటూ కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వ పాలనను వర్ణించడానికి ఉపయోగించే అన్ని పదాలను అన్‌పార్లమెంటరీ వర్డ్స్ జాబితాలో చేర్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు. పార్లమెంట్లో సాధారణంగా వాడే పదాలపై కూడా నిషేధం విధించడమేంటని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ప్రశ్నించారు. తాను ఈ పదాలను వినియోగిస్తానని, కావాలంటే సస్పెండ్ చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే పదాలను కూడా వాడొద్దని చెప్పడం నిరంకుశపాలనకు నిదర్శనమని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. బ్రిటీషర్ల కాలంలో కూడా ఇలాంటి పరిస్థితులు రాలేదని ధ్వజమెత్తారు. మోదీని పొగడటం తప్ప, ఆయన్ని విమర్శించే పదాలను వాడకూడదా? అంటూ శివసేన నేత ప్రియాంక చతుర్వేది అసహనం వ్యక్తం చేశారు.
పార్లమెంట్లో ఇవి బూతులట
అబ్యూజ్డ్ (దుర్భాషలాడు), అహంకార్ (గర్విష్టి), అషెమ్డ్ (సిగ్గుచేటు), బిట్రేయ్డ్ (ద్రోహి), కొవిడ్ స్ప్రెడర్ (కరోనా వ్యాప్తిదారి), చంచా (సాగిలపడేవ్యక్తి), చీటెడ్ (మోసం చేయడం), కరప్ట్ (అవినీతిపరుడు), కొవర్డ్ (పిరికివాడు), క్రిమినల్ (నేరగాడు), క్రొకడైల్ టియర్స్ (మొసలికన్నీరు), డిక్టోరియల్ (నియంతృత్వం), డ్రామా (నాటకం), ఫూలీష్ (మూర్ఖుడు), గూన్స్ (గూండాలు), హిపోక్రసి (వంచన), ఇన్కంపిటెంట్ (అసమర్థుడు), జైచంద్ (దేశద్రోహి), జుమ్లాజీవి (అబద్దాలకోరు), ఖలిస్తానీ, శకుని, తానాషా (నిరంకుశుడు).
పార్లమెంట్లో ఏ పదాన్ని నిషేధించట్లేదు. అభ్యంతరకరమైన పదాలను కేవలం రద్దు చేస్తున్నాం. సభా గౌరవాన్ని కాపాడుతూ సభ్యులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. ఎవరి హక్కులను మరెవరూ హరించలేరు.
-లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా