Rahul Gandhi | న్యూఢిల్లీ, ఆగస్టు 8: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం లోక్‌సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి లోక్‌సభలో ఒక పక్క వాడీవేడిగా చర్చలు జరుగుతుండగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కునుకు తీస్తూ కన్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చర్చ సందర్భంగా రాహుల్ అలా నిద్రపోవడాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీ గిరిరాజ్‌సింగ్ ఎగతాళి చేశారు.
పదేపదే మాట్లాడుతూ తోటి సభ్యుని నిద్రకు భంగం కలిగించకండి అంటూ రిజిజు చమత్కరించారు. మైనారిటీలకు సంబంధించిన ముఖ్యమైన సవరణ బిల్లుపై చర్చ జరుగుతుంటే బాధ్యత గల విపక్ష నేతకు ఇది తగునా? అని పలువురు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారు. ప్రజల కోసం సభలో నిద్రపోతూ కష్టపడుతున్న మన ప్రియతమ రాహుల్ గాంధీని చూడండి అంటూ ఒకరు, రాహుల్ గాంధీ శక్తి సామర్ధ్యాలు ఏంటో ప్రజలకు తెలియాలంటే ఈ వీడియోను తప్పక షేర్ చేయాల్సిందేనని మరొకరు వ్యాఖ్యానించారు.