పాట్నా : బీహార్లో గతేడాది కాలం నుంచి మూడు జిల్లాల్లో 620 ఎకరాల్లో సాగు చేసిన నల్లమందు(ఓపియం) పంటను ధ్వంసం చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలోని జాముయి, ఔరంగాబాద్, గయా జిల్లాల్లో ఈ నల్లమందు సాగు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఓపియం సాగు ద్వారా మావోయిస్టులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. 2021-22 ఏడాదిలో 620 ఎకరాలు, 2020-21లో 584 ఎకరాలు, 2019-20లో 470 ఎకరాల్లో ఓపియం పంటను సాగు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే నల్లమందు పంటను అధికంగా వర్షాకాలం సీజన్లో సాగు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి అధికారులు వెళ్లరని భావించి, అక్కడ ఈ పంటను సాగు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసు బలగాల సాయంతో అధికారులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి పరిశీలన చేయగా, ఓపియం పంటను గుర్తించినట్లు పేర్కొన్నారు.