Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్‌ని ఈ దాడికి ఉపయోగించింది. భారత సైన్యం, వైమానిక దళం, నావికాదళం సమన్వయంతో పని చేసి ఉగ్రవాద స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి. దాడి కోసం ఉగ్రవాద స్థావాల గురించి నిఘా సంస్థలు సమాచారం అందించాయి. ఈ మొత్తం ఆపరేషన్ని భారత సరిహద్దు నుంచే నిర్వహించింది. అయితే, దాడుల్లో ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు సమాచారం. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్స్గానూ పిలుస్తారు. ఈ డ్రోన్లు లక్ష్యాలను గుర్తించి, వాటిపై విరుచుకుపడతాయి.
సూసైడ్ డ్రోన్స్‌ని కామికేజ్ డ్రోన్స్ అని పిలుస్తారు. ఇవి మానవ రహిత వైమానిక ఆయుధాలు. లక్ష్యం మేరకు ఆకాశంలో ఎగురుతూ కమాండ్ అందిన వెంటనే శత్రువుల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం వీటి ప్రత్యేకత. ఈ డ్రోన్లు ప్రాణ నష్టం నివారించడంలో సహాయపడుతాయి. వీటికి ప్రత్యేకమైన నిఘా సామర్థ్యం ఉంటుంది. తద్వారా శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించవచ్చు. సూసైడ్ డ్రోన్ల పరిమాణం, పేలోడ్, వార్ హెడ్ మారుతూ ఉంటుంది. లోయిటింగ్ మందుగుండు సామగ్రిని ఒకేసారి మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి పేలిపోయి టార్గెట్‌ని ధ్వంసం చేస్తాయి. సూసైడ్ డ్రోన్లను మొదట 1980లో ఉపయోగించారు. 1990, 2000 సంవత్సరాల్లో వీటి వాడకం పెరిగింది. యెమెన్, ఇరాక్, సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో ఈ డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించారు. 2021 సంవత్సరంలో వాణిజ్య నౌకలను కూడా ఆత్మాహుతి డ్రోన్లు టార్గెట్ చేస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని భారత్ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుంది. బహావల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలు, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరాలు, చక్ అమ్రు, సియాల్కోట్, భీంబర్, గుల్పూర్, కోట్లి, బాగ్, ముజఫరాబాద్ ప్రాంతాలు ఉన్నాయి. అయితే, సైనిక స్థావరాలపై మాత్రం భారత్ దాడి చేయలేదు. బుధవారం తెల్లవారుజామున 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 22న పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ నేపాలి పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 29న త్రివిధ సైన్యాధిపతులు, సీడీఎస్, జాతీయ భద్రతా సలహాదారు సహా సీనియర్ మంత్రులతో జరిగిన సమావేశంలో సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.