OPERATION SINDOOR | జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన 15 రోజుల తర్వాత భారత సైన్యం ఈ చర్యలు తీసుకుంది. ఈ మెరుపుదాడులతో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. భారత్ దాడితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలుదేశాల నేతలు స్పందించారు. ఈ ఉద్రిక్త పరిస్థితి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం-పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
పాకిస్తాన్ లోపల భారత దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. పహల్గాం దాడిని సిగ్గుచేటుగా ట్రంప్ అభివర్ణించారు. గతం ఆధారంగా ఏదో జరుగబోతోందని ప్రజలకు తెలుసునని అనుకుంటున్నానన్నారు. వారు (భారత్) చాలాకాలంగా పోరాడుతున్నారని.. దాని గురించి ఆలోచిస్తే వారు అనేక దశాబ్దాలు పోరాడుతున్నారన్నారు. ఇది చాలా త్వరగా ముగియాలని తాను ఆశిస్తున్నాన్నారు. భారత్ చర్యల తర్వాత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారతదేశం-పాకిస్తాన్లను సైనిక సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని ఆయన అన్నారు.
సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మాట్లాడుతూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులో భారత సైనిక కార్యకలాపాల గురించి సెక్రటరీ జనరల్ చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. గరిష్ట సైనిక సంయమనం పాటించాలని ఆయన రెండు దేశాలకు పిలుపునిచ్చారు. భారతదేశం-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదన్నారు. భారత్ చర్యపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్ మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడూ పరిష్కారం కాదని, కానీ అలాంటి ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాదులను గుర్తించి శిక్షించడం ముఖ్యమన్నారు. ఉగ్రవాదాన్ని మద్దతు ఇచ్చే ఏ దేశమైనా అటువంటి చర్యలు పరిణామాలను కలిగిస్తాయని చూడడం ముఖ్యం, యునైటెడ్ స్టేట్స్ శాంతియుత దేశాలకు మద్దతు ఇవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి యునైటెడ్ స్టేట్స్, భారతదేశం సహకరించాలన్నారు.
భారత్ దాడిని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ ధ్రువీకరించారు. అది యుద్ధప్రాతిపదికన చర్య అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అవమానాలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ సమయంలోనూ బెదిరింపులకు దిగడం మానలేదు. పాకిస్తాన్ డాన్ న్యూస్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్లోని ఐదు చోట్ల దాడులు జరిగాయని షాబాజ్ తెలిపారు. ఈ యుద్ధ చర్యకు తీవ్రంగా స్పందించడానికి పాకిస్తాన్కు పూర్తి హక్కు ఉందని షహాబాద్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సాయుధ దళాలతో దేశం మొత్తం నిలుస్తుందని.. మొత్తం పాకిస్తాన్ దేశం, నైతికత, స్ఫూర్తి ఉన్నతంగా ఉందన్నారు. పాకిస్తాన్, సాయుధ దళాలకు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. వారి ఉద్దేశాలలో విజయం సాధించడానికి మేము ఎప్పటికీ అనుమతించమన్నారు.
పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారతదేశం ఇటీవలి సైనిక చర్యపై బెదిరింపులు జారీ చేశారు. భారత్ చర్య ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, దేశాల మధ్య నియమాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం మరోసారి ఉగ్రవాదాన్ని సాకుగా చూపుతూ తనను తాను బాధితురాలిగా చూపించుకోవడానికి ప్రయత్నించిందని, తప్పుడు కథనాన్ని ప్రదర్శించిందని ఇషాక్ దార్ అన్నారు. భారతదేశం ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. భారతదేశం ఈ నిర్లక్ష్య చర్య రెండు అణ్వాయుధ దేశాల మధ్య పెద్ద సంఘర్షణకు దారితీస్తుందని, ఇది మొత్తం ప్రపంచానికి ముప్పు కలిగిస్తుందని దార్ బెదిరింపులకు దిగారు.
ఆపరేషన్ సిందూర్ గురించి భారత సీనియర్ అధికారులు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యాతో మాట్లాడింది. భారత సైన్యం తీసుకున్న చర్య గురించి వారికి వివరంగా తెలియజేసింది.