ఖాండ్వా: చిన్నప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ అకారణంగా కొట్టాడని కోపం పెంచుకున్న ఒక యువకుడు ఆ వ్యవస్థపైనే పగపట్టి పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేస్తూ గత 15 ఏండ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. 29 ఏండ్ల దీపేశ్ అలియాస్ దీపేంద్ర గత నెల 30న మధ్యప్రదేశ్ ఖాండ్వాలోని ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఈ నెల 11న అరెస్టయ్యాడు. అతడి వద్ద నుంచి రూ.2.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు విస్తుపోయారు. తాను కేవలం పోలీసుల ఇండ్లలో మాత్రమే చోరీలు చేస్తానని, వారిపై ప్రతీకారంతోనే ఈ చోరీలు చేస్తున్నట్టు చెప్పాడు. తనకు 14 ఏండ్లు ఉన్నప్పుడు ఒక పోలీస్ అకారణంగా దారుణంగా కొట్టాడని, అప్పటి నుంచి పోలీసులపై పగ పట్టానని, వారి ఇండ్లలోనే ఇన్నాళ్లూ చోరీలు చేసినట్టు తెలిపాడు. మొదట తాను పోలీస్ లైట్లు అమ్మే వ్యక్తిగా కాని, అలంకరణ వస్తువులు అమ్మకం దారునిగా కాని ఆయా ఇండ్లకు వెళ్లి పరిస్థితులను అంచనా వేసి రాత్రి చోరీకి పాల్పడతానని ఆయన తెలిపాడు.