అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం, ఆ శక్తిని గౌరవించడం కృతజ్ఞతా పూర్వకమైన సంస్కారం. మన విధి కూడా. అందుకే నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు ప్రతి అడుగులోనూ ఓ శ్లోకం చదవాలంటూ నిర్దేశిస్తాయి శాస్ర్తాలు.
అసలు ఎందుకు ఇన్నేసి శ్లోకాలు చదవాలి? ఏదో ఒక్క శ్లోకం చదివితే సరిపోదా అంటే, నిజమే… సరిపోదు. అనంతమైన విశ్వంలో ప్రతి అణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని ఎంతని స్తోత్రం చెయ్యగలం? ఆ స్వామి మనకు ఇచ్చిన లెక్కలేనన్ని వరాలకు ఏమని కృతజ్ఞత చెప్పగలం? మనం వేసే ప్రతి అడుగూ, మాట్లాడే ప్రతి మాటా, తినే ప్రతి మెతుకూ, చివరకు తీసుకునే శ్వాస కూడా పరమాత్మ మనకు ఇచ్చిన వరాలే! పరమాత్మ శక్తి చైతన్యం మనకు తోడు లేకపోతే ఒక్క అడుగూ వెయ్యలేం. అందుకే, అనుక్షణం దైవాన్ని తలచుకుంటూ, మనల్ని మనమే ఉద్ధరించుకునే మార్గం దైవ శ్లోక-స్తోత్ర పారాయణం.
మనసు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా ఉండదు. అది దాని స్వభావం. పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అది ప్రకృతి నియమం. అదేవిధంగా, మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే అందులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. అనేక విషయ వాసనలతో నిండిపోతుంది. అందుకే, మెలకువగా ఉండే ప్రతి క్షణాన్నీ దైవనామ స్మరణతో నింపాలి. నామ-స్తోత్ర పారాయణం ద్వారా మనసును అంతర్ముఖం చేసుకోగలిగితే, విషయ చింతన తగ్గుతుంది. పరమాత్మ సన్నిధికి మార్గం సుగమం అవుతుంది. మనం చదివే ప్రతి శ్లోకానికీ, చేసే ప్రతి స్తోత్రానికీ అంతిమ పరమార్థం ఇదే.

మహాభారత యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు మొదలైన శత్రువీరులు అర్జునుడిపై వేసిన బాణాలు అత్యంత శక్తిమంతమైనవి. కేవలం శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల వాటి శక్తి పూర్తిగా పనిచేయలేదు. ఈ రహస్యం తెలియని అర్జునుడు శత్రుపరాజయం అంతా తన శక్తిసామర్థ్యాల వల్లనే జరిగిందని అనుకుంటాడు. యుద్ధం ముగింపునకు వస్తుంది. చివరి రోజు సాయంకాల సమయం అది.. యుద్ధరంగం నుంచి అర్జునుడు శిబిరానికి చేరుకుంటాడు. ఇంకా, అల్లంత దూరంలో శిబిరం ఉందనగా, కృష్ణుడు రథాన్ని ఆపి, అర్జునుడిని దిగమంటాడు. పరమాత్మ మాట కాదనలేక రథం దిగుతాడు అర్జునుడు.
ఆ వెంటనే కృష్ణుడు కూడా రథం దిగుతాడు. ఇద్దరూ… కొద్ది అడుగులు నడవగానే, భయంకరమైన శబ్దం చేస్తూ ఆ రథం ముక్కలు చెక్కలుగా విరిగిపోతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, రథం దగ్ధమైపోతుంది. ఇదంతా చూస్తున్న అర్జునుడు భయంతో కంపించిపోతాడు. ఎందుకిలా జరిగిందో అర్థం చేసుకోలేకపోతాడు. అప్పుడు, కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ… ‘అర్జునా! ఇంతకాలం నేను రథంలో ఉన్న కారణంగా శత్రువీరులు నీపై ప్రయోగించిన అస్త్రశస్ర్తాలు నిన్నేమీ చెయ్యలేకపోయాయి. వాటి శక్తి ఈ రథాన్ని ఆవహించి, నా కారణంగా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు నేను రథాన్ని విడిచిపెట్టాను. అస్ర్తాలు వాటి పని అవి నిర్వహించాయి’ అంటాడు. భగవానుడి శక్తికి మరోసారి నివ్వెరపోతాడు అర్జునుడు.
మన జీవన రథానిదీ ఇదే కథ. భగవంతుడి శక్తి మనల్ని ఆవహించినంత కాలం ఏ ప్రారబ్ధ కర్మా మనల్ని ఏవిధంగా బాధించదు. కేవలం పాక్షికంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయే కానీ, మనల్ని పూర్తిగా ఇబ్బందిపెట్టవు. అదే భగవచ్ఛక్తి మనకు దూరమైతే, విషయవాంఛలు, ప్రారబ్ధకర్మల విషాగ్నిలో మనం దగ్ధం కాకతప్పదు అనే సందేశాన్ని ఈ కథ ద్వారా మనం అందుకోవాలి. అందుకే, నిత్యజీవితంలోని ప్రతి అడుగులో ఫలానా శ్లోకం చదవమంటూ, మనలో అనుక్షణం దైవీకమైన శక్తిని వృద్ధి చెందే ఉపాయాన్ని సూచించాయి శాస్ర్తాలు.

దైవారాధన, శక్తి ఉపాసన అంటే… పెద్ద పెద్ద మంత్రాలు మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. ‘అమంత్రం అక్షరం నాస్తి’- మంత్రం కాని అక్షరం లేదని చెబుతాయి శాస్ర్తాలు. మన వాక్కు ద్వారా బయటికి వచ్చే శబ్దంలోని శక్తిని గుర్తించి, ఉపాసించగలిగితే అంతకుమించిన తపస్సు మరొకటి ఉండదు. అందుకనే, ప్రతి మనిషీ ఈ ఉపాసన చేసేందుకు వీలుగా నిత్యజీవితంలోని ప్రతి అడుగులోనూ దైవప్రార్థన పేరుతో శబ్ద బ్రహ్మోపాసన చేసేలా వీలు కల్పించారు సనాతన రుషులు.
ఉదయం నిద్రలేవగానే…
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్
త్రిశక్తులూ మన చేతిలోనే ఉంటాయి. ఆ శక్తుల్ని గ్రహించుకుని, గమనించుకోవాలనే సందేశం కన్నుతెరవగానే అందిస్తుందీ శ్లోకం. మనలో ఉండే ప్రాణశక్తి, ఉపాసన ద్వారా చైతన్యశక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. అటువంటి శక్తి ప్రచోదనం ద్వారా, పరాశక్తిని ఉపాసన చేయడానికి పునాది ఈ శ్లోకం చదవటం నుంచే ప్రారంభం అవుతుంది.
మంచం దిగుతూ, పాదాన్ని నేల మీదే మోపే ముందుగా…
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే
విష్ణుపత్నీ సమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే॥
అనంతకోటి మానవ సమూహాన్ని భరిస్తున్న భూదేవి పట్ల మనం చూపాల్సిన కృతజ్ఞతను ప్రకటిస్తుందీ శ్లోకం. అడుగులతో తొక్కి బాధించినా, మన జీవనానికి అవసరమైన అన్నంతో సహా అన్ని ఓషధుల్నీ తన నుంచి ఆవిర్భవింపజేస్తుంది భూమాత. ఆ తల్లికి మించిన శాంతమూర్తి సృష్టిలో ఇంకెవ్వరూ లేరు. నీరు, పర్వతాలతో నిండిన భూమాత నా పాదాలతో తొక్కుతున్న పాపానికి మన్నించమని వేడుకోవటం పై శ్లోకంలోని అర్థం, పరమార్థం. మాతృమూర్తి పట్ల, మాతృభూమి పట్ల మన కర్తవ్యం, కృతజ్ఞత… నిద్రలేవటంతోనే గుర్తు చేస్తుందీ శ్లోకం.
స్నానం చేసే సందర్భంలో…
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు॥
భౌతికంగా కంటికి కనిపించే అన్ని అశౌచాలను ప్రక్షాళన చేసే సామర్థ్యం కేవలం నీటికి మాత్రమే ఉంది. దీంతోపాటు, కంటికి కనిపించని పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఈ నీటితో శుద్ధి చేసుకున్న తర్వాతనే మొదలవుతుంది. బాహ్యంగానూ, అంతరంగంలోనూ స్ఫటికం వలే స్వచ్ఛంగా ఉండే అవకాశం కల్పించే జలశక్తి మనల్ని ఆవహించేందుకు ఈ శ్లోకం పఠించాలని పెద్దలు సూచించారు.
సూర్య నమస్కారం చేస్తూ…
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్
స్నానం పూర్తి కాగానే, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తిని చూస్తూ, ధ్యానించాల్సిన శ్లోకం ఇది. నిద్రలేవగానే చేసే ప్రార్థన ద్వారా త్రిశక్తులు మనల్ని ఆవహిస్తే, సూర్యోపాసన ద్వారా త్రిమూ ర్తులు మనకు ప్రసన్నులవుతారు. ఈవిధంగా త్రిమూర్తి, త్రిశక్తి ఉపాసన చేసే సులువైన మార్గం మనకు చూపించారు పూర్వికులు.
భోజనం చేసే ముందుగా…
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥
జఠరాగ్ని సవ్యంగా ఉన్నప్పుడే మనం తీసుకునే ఆహారం జీర్ణమై, శక్తిగా మారుతుంది. లేకపోతే అధికంగా నెయ్యి పోసిన హోమగుండం మాదిరిగా చప్పబడిపోతుంది. రుషులు చేసేన అసంఖ్యాక యజ్ఞాల్లో నెయ్యి అధికంగా తీసుకున్న కారణంగా అగ్నిదేవుడికే జఠరాగ్ని సమస్య వచ్చింది. కృష్ణార్జునుల సహాయంతో ఖాండవ వనాన్ని దహించి, బాధ తీర్చుకున్నాడు అగ్ని. మనదీ అదే పరిస్థితి. మనలో జఠరాగ్ని రూపంలో ఉండే శక్తిని ఉద్దీపనం చేసుకోవడం, మనలోనే ఉండే ఆత్మారాముడికి నివేదన చెయ్యటం నేర్పిస్తుందీ శ్లోకం.
ప్రయాణం సమయంలో…
యశ్శివోనామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం॥
మనం ఏది తలిస్తే అదే జరుగుతుందంటారు పెద్దలు. దీన్నే తథాస్తు దేవతలంటారు ఇంకొందరు. ఏది ఏమైనప్పటికీ, మనలో కలిగే భావనలే మనల్ని నడిపిస్తాయి. అందుకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాయనేది సుస్పష్టం. అందుకే, ఏ పని ప్రారంభించినా, అడుగు వేసేముందుగా మంగళం జరగాలని కోరుకుంటూ, దైవ ప్రార్థన చేసే శ్లోకం ఇది. శివ, శక్తులు నా ప్రయాణంలో అంతటా నన్ను ఆవహించి, అన్నిటా నాకు విజయాన్ని కలిగించాలని ఈ శ్లోకానికి భావం.
నిద్రపోయే ముందు….
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి॥
రోజంతా అనేక కార్యక్రమ నిర్వహణలో అలసిన మనిషి, విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించే సందర్భంలో చదవాల్సిన శ్లోకం ఇది. ఐదుగురు దివ్య పురుషుల స్మరణతో సాగుతుందీ శ్లోకం. ఈ ఐదుగురు పురుషులు ఐదు శక్తులకు ప్రతీక. జాగ్రదవస్థ నుంచి స్వప్న, సుషుప్తిలోకి జారుకునే మనిషి ఈ శక్తుల్ని చైతన్యవంతం చేసుకోవాలి. అప్పుడే ఏ దుస్వప్నం రాదు. కల అంటే మనసు పొందే విరుద్ధమైన భావన. తనకు తెలియని, తాను అనుకోని, తాను ఊహించని స్థితికి మనసు చేరుకుంటుంది.
ఆ ఆలోచన చేస్తుంది. అవే కలలు అవుతాయి. పై శ్లోకంలో చెప్పుకొన్న ఐదు శక్తుల్ని మనిషి వృద్ధి చేసుకుంటే దుస్వప్నాల వల్ల కలిగే విపరీత ఫలితాలు అంటుకోవు. అంటే, ఏ విధమైన విపరీత భావన మన సులోకి ప్రవేశించదని అర్థం. ఎప్పుడైతే, మనసు వికల్పం కాదో… ఆ స్వచ్ఛమైన మనసు పరమాత్మకు వేదికగా నిలుస్తుంది. అంతి మంగా హృదయాకాశంలో కొలువైన దైవాన్ని దర్శించుకునే పూర్ణ త్వం మనిషికి సిద్ధిస్తుంది. నిత్య ప్రార్థన శ్లోకాల రహస్యం ఇదే.
-డాక్టర్ కప్పగంతు రామకృష్ణ