మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అని తైత్తరీయ ఉపనిషత్తు 11వ అనువాకం ప్రబోధిస్తున్నది. తల్లిని తండ్రిని ఆచార్యుని అతిథిని దైవంగా భావించి సేవించాలని భావం. ఆచార్యుడు వేదాన్ని బోధించి ఇంటికి తిరిగి పంపేటప్పుడు శిష్యుడికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వీడుకోలు చెప్పే సందర్భం ఇది. గురువుగారి మాటలను సాధ్యమైనంత ఆచరించే వారు శిష్యులు. వారిని చూసి తమ నడవడికను తీర్చిదిద్దుకునే వారు కొందరు. దీనిని నిరూపించేదే ధర్మవ్యాధుని చరిత్రం. కౌశికుడు నిష్ఠాగరిష్ఠుడు. తీవ్రమైన తపస్సు చేసిన వాడు.
ఒకసారి ఒక చెట్టు కింద కూర్చుని వేద పఠనం చేస్తుంటే ఒక కొంగ రెట్ట వేసింది. అతనికి కోపం వచ్చింది. దానిని తీక్షణంగా చూశాడు. వెంటనే అది మలమల మాడి చనిపోయింది. కౌశికుడు తర్వాత భిక్షాటనకు వెళ్లాడు. ఒక ఇంటి ముందు నిలబడి ‘భవతి భిక్షాం దేహి’ అన్నాడు. ఆ ఇల్లాలు ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నది. భర్త పాదాలు కడిగి ఆహారం సమకూర్చింది. తర్వాత భిక్ష తీసుకు వచ్చింది. ఆలస్యానికి అతనికి కోపం వచ్చింది. కానీ, ఆమె ప్రశాంతంగా ‘నీ కోపం నన్నేమీ చేయలేదు.
నేను కొంగను కాదు. నీవు మిథిలా నగరం వెళ్లి ధర్మవ్యాధుని ద్వారా తత్వాన్ని గ్రహించు’ అన్నది. కౌశికుడు పశ్చాత్తాప పడి మిథిలకు వెళ్లాడు. ధర్మవ్యాధుడు అంటే ఎవరో మహర్షి అనుకున్నాడు. కానీ అతను మాంసం అమ్ముకునే కసాయివాడు. ధర్మవ్యాధుడు ఎంతో గౌరవంగా కౌశికుణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు చేస్తున్న సేవ చూసి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అతని నుంచి ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాడు. ధర్మం తెలుసుకునేందుకు చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. తల్లిదండ్రులను సేవించేవాడు గొప్పవాడని ఈ వృత్తాంతం తెలియజేస్తున్నది
-డా॥ వెలుదండ సత్యనారాయణ