న్యూఢిల్లీ, మే 7: బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌పై భారత్ క్షిపణి దాడులకు దిగటంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్ము సహా 25 నగరాల్లోని విమానాశ్రయాల్ని తాత్కాలికంగా మూసివేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా తదితర సంస్థలు నడుపుతున్న 300కుపైగా ఫ్లైట్స్ రద్దు అయ్యాయి.
దేశంలో అత్యంత రద్దీ తో కూడిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కనీ సం 35 విమానాలు రద్దు అయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే విమానాలు రద్దు చేసినట్టు ఖతార్ ఎయిర్వేస్ ‘ఎక్స్’లో ప్రకటించింది. జమ్ము, శ్రీనగర్, లేహ్, జోద్పూర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లలోని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయటంతో, ఈ నగరాలకు ప్రయాణించే విమానాలను మే 10 వరకు రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. టికెట్ క్యాన్సల్ చేసుకున్న వారికి పూర్తి మొత్తం రిఫండ్ చేస్తామని అన్నారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఉగ్రస్థావరాలపై భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది. ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పంజాబ్, గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రావిన్స్‌ల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో లాహోర్ గగనతలాన్ని 24 గంటలపాటు మూసేస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. వాళ్లు ఇప్పటికే భారీగా నిత్యావసరాలను కొనుగోలు చేసి నిల్వ చేస్తుండగా, బుధవారం దాడులతో ఇది మరింత పెరిగింది. నగదు కోసం ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరుతున్నట్టు పాకిస్థాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో బుధవారం పాకిస్థాన్ నుంచి అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో విమానాశ్రయాల్లో భారీగా ప్రయాణికులు ఇరుక్కుపోయారు. తిరిగి సర్వీసుల ప్రారంభం సమాచారం లేదని వాపోనన్నారు.