Operation Sindoor | ఉగ్రవాదంపై మానవాళి పోరాటంలో ఆపరేషన్ సిందూర్ ఓ సువర్ణాధ్యాయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వదేశీ ఆకాశ్‌తీర్ వైమానిక రక్షణ- రిపోర్టింగ్ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ రంగ సంస్థల సహకారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక వివాదంలో ఆకాశ్‌తీర్ వైమానిక రక్షణ వ్యవస్థ కీలకపాత్ర పోషించింది. స్కోప్ ఎమినెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర గురించి మాట్లాడారు. ఆదాయం, లాభం వంటి కీలకమైన ఆర్థిక పారామితులలో ప్రభుత్వ రంగ సంస్థలు బాగా పనిచేశాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మూడింట ఒక వంతు లాభాలను ఆర్జిస్తున్నాయని, గత దశాబ్దంలో ప్రభుత్వ రంగ సంస్థల నికర లాభం గణనీయంగా పెరిగిందన్నారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలు సుపరిపాలన, పారదర్శకత రంగంలో ప్రమాణాలను నిర్దేశించాయని ముర్ము తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రాముఖ్యతపై స్పందిస్తూ.. స్వయం సమృద్ధ భారతదేశాన్ని నిర్మించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశ రక్షణ రంగం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. భారతదేశంపై దాడి చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్వదేశీ ఆకాశ్‌తీర్ వైమానిక రక్షణ వ్యవస్థ తన సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఈ వ్యవస్థ సృష్టికి ప్రభుత్వ రంగ సంస్థలు దోహదం చేశాయని.. ఇది వారికి చాలా గర్వకారణంగా నిలుస్తుందన్నారు. ఆవిష్కరణలు, పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం ద్వారా జాతీయ భద్రతలో స్వావలంబన సాధించడంలో పీఎస్‌యూలు ప్రధాన పాత్ర పోషించాయని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. వ్యవసాయం, మైనింగ్, అన్వేషణ, తయారీ, ప్రాసెసింగ్, సేవలు వంటి అనేక రంగాల్లో పీఎస్‌యూలు కీలక పాత్ర పోషించాయని.. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రభుత్వ జాతీయ ప్రాధాన్యతల్లో ఒకటని రాష్ట్రపతి పేర్కొన్నారు.