Operation Sindoor | న్యూఢిల్లీ, మే 12 : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్‌పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించడంపై దేశవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతున్నది. వాణిజ్యం ఆపేస్తానని బెదిరించి సీజ్‌ఫైర్‌కు ఒప్పించినట్టు ట్రంప్ బహిరంగంగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలతో ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో మూసివేసిన 32 ఎయిర్‌పోర్టులను తిరిగి తెరిచినట్టు భారత విమానయాన నియంత్రణ సంస్థ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. శ్రీనగర్, ఛండీగఢ్, అమృత్‌సర్‌లో విమానాల రాకపోకలు ప్రారంభమైనట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) స్పష్టం చేసింది. ప్రయాణికులు విమానాల స్టేటస్ కోసం ఆయా సంస్థల ఎయిర్‌లైన్స్‌లను నేరుగా లేదా వారి వెబ్సైట్ల ద్వారా వివరాలను తెలుసుకోవాలని ఏఏఐ సూచించింది.
సరిహద్దుల్లో బలగాలను తగ్గించేందుకు భారత్-పాకిస్థాన్‌లు అంగీకరించాయి. ఈ మేరకు రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్(డీజీఎంవో)లు నిర్ణయానికి వచ్చినట్టు ఇండియా టుడే వెల్లడించింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపొద్దని.. దూకుడుగా వ్యవహరించొద్దని సోమవారం సాయంత్రం 5 గంటలకు హాట్‌లైన్ ద్వారా జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు ఓ ప్రకటన తెలిపింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగాల్సి ఉండగా.. సాయంత్రం 5 గంటలకు జరిగింది. మరోవైపు పాకిస్థాన్ శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించగా.. 19 రోజుల తర్వాత తొలిసారిగా ఆదివారం రాత్రి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు ఎల్వోసీ వెంబడి తుపాకీల మోత వినిపించగా.. మే 7 నుంచి 11 వరకు డ్రోన్లు, వైమానిక దాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. అయితే సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని సంబంధింత వర్గాలు పీటీఐకి తెలిపాయి.
వారం రోజులుగా ఉత్తర భారతదేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సోమవారం చల్లబడ్డాయి. డ్రోన్లు, బాంబుల మోత లేకపోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టు పీటీఐ కథనం వెల్లడించింది. నాలుగు రోజుల పాటు భారత్-పాక్‌ల మధ్య మిలటరీ చర్యలు కొనసాగగా.. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితి మారింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు, బాంబుల మోత పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. కాగా సోమవారం వారు తిరిగి తమ ప్రాంతాలకు రావడం కనిపించింది. కొన్ని చోట్ల భద్రతా బలగాలు మందుపాతరలను తొలగించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. యూరీ సెక్టార్‌లోని కమల్కోట్కు చెందిన అర్షద్ అహ్మద్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందన్నారు.
పాకిస్థాన్ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించదని భావిస్తున్నామని తెలిపారు. ఏవైనా అనుమానస్పద వస్తువులు కనిపిస్తే వాటిని ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని యూరీ ఎమ్మెల్యే సజ్జద్ షఫీ స్థానికులను కోరారు. ఏవైనా అనుమానస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పుడే ఇండ్లలోకి రావొద్దని తాము ఇంకా పూర్తి స్థాయిలో మందుపాతరలను తొలగించలేదని అధికారులు ఆదివారం స్థానికులను హెచ్చరించారు. పంజాబ్‌లోని మార్కెట్లు ప్రజలతో నిండిపోయి కనిపించాయి.. అయితే సరిహద్దుల్లోని స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు మాత్రం తెరుచుకోలేదు. సోమవారం ఉదయం పలు చోట్ల టీ స్టాళ్లు, షాపుల వద్ద జనాలు తిరుగుతూ కనిపించారు. జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం రాత్రి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.