న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. భారతీయ సైనిక దళాలు .. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న 9 ఉగ్రస్థావరాలను ఆ ఆపరేషన్ సమయంలో నేలమట్టం చేశారు. అయితే ఆ అంశంపై చర్చించేందుకు పార్లమెంట్ రెఢీ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చించనున్నారు. జూలై 29వ తేదీన ఆ చర్చ జరగనున్నది. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల పాటు చర్చించేందుకు సమయాన్ని కేటాయించినట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఇవాళ జరిగిన బీఏసీ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం కుదిరినట్లు చెబుతున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ సర్కారు విదేశాంగ విధానాన్ని ఆయన ప్రశ్నించారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తున్నారని, దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రభుత్వం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇండో,పాక్ ఉద్రిక్తతల వేళ అయిదు యుద్ధ విమానాలు కూలిన అంశాన్ని కూడా ట్రంప్ ఇటీవల మళ్లీ మళ్లీ లేవనెత్తడంతో విపక్షాలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని ఒకవైపు చెబుతున్నారని, మరో వైపు విజయం సాధించినట్లు చెబుతున్నారని, డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఆపరేషన్ సింధూర్ను ఆపింది తానే అని 25 సార్లు చెప్పారని, దీంట్లో ఏదో మర్మం ఉందని, మన విదేశాంగ విధానాన్ని ఏ దేశం కూడా సపోర్టు చేయలేదని రాహుల్ గాంధీ అన్నారు.