FSSAI |న్యూఢిల్లీ: డోర్ డెలివరీ చేసే ఆహార ఉత్పత్తుల కనీస కాల పరిమితి(షెల్ఫ్ లైఫ్) విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈఓ సమావేశమయ్యారు. డెలివరీ చేసే సమయానికి ఆహార ఉత్పత్తుల మొత్తం షెల్ఫ్ లైఫ్లో కనీసం 30 శాతం మిగిలి ఉండాలని, లేదా ఎక్స్పైరీకి కనీసం 45 రోజులు ఉండాలని ఆదేశించారు.
ఆహార సరఫరాదారులకు కచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ ఉండాలని స్పష్టం చేశారు. సురక్షితంగా ఆహారాన్ని డెలివరీ చేయడంపై డెలివరీ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు. కల్తీ జరగకుండా నివారించేందుకు ఆహార ఉత్పత్తులు, ఆహారేతర ఉత్పత్తులను వేర్వేరుగా డెలివరీ చేయాలని సూచించారు.