Lok Sabha Elections | న్యూఢిల్లీ, జూన్ 3: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. దేశవ్యాప్తంగా బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో 9.6 శాతం (797 మంది) మాత్రమే మహిళలని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. 1957 సార్వత్రిక ఎన్నికల్లో 3 శాతంగా ఉన్న మహిళా అభ్యర్థుల సంఖ్య 10 శాతానికి చేరడానికి దాదాపు 70 ఏండ్లు పట్టింది.
తాజా ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున పోటీ చేస్తున్న మహిళల సంఖ్యను పరిశీలిస్తే.. తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి తరపున పోటీ చేసినవారిలో 50 శాతం మంది మహిళలే ఉన్నారు. బీజేపీ తరపున 69 మంది(16 శాతం), కాంగ్రెస్ నుంచి 41 మంది(13), జేఎఎం, ఆర్జేడీ నుంచి 33 శాతం మంది మహిళలు బరిలో నిలిచారు. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ, చిన్న పార్టీలే మహిళలకు ఎక్కువగా టికెట్లు కేటాయించడం గమనార్హం.