న్యూఢిల్లీ : దేశంలో కూరగాయల ధరలు భగ్గుమంటూ సామాన్యుడికి చుక్కలు చూపుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ వీటి ధరలు పైపైకి ఎగబాకుతాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల విభాగం గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా బంగాళాదుంపల నెల సగటు ధర పదినెలల గరిష్ట స్ధాయిలో ఉండగా, ఉల్లిగడ్డల నెల సగటు ధర తొమ్మిది నెలల గరిష్టస్ధాయిలో ఉండగా, టమాట ధర నాలుగేండ్ల గరిష్టస్ధాయికి చేరింది.
దేశవ్యాప్తంగా టమాట సగటు ధర నవంబర్‌లో కిలోకు రూ 54గా ఉండగా, అక్టోబర్‌లో ఇది కిలోకు రూ 43కాగా, సెప్టెంబర్‌లో రూ 28 పలికింది. ఇక ఉల్లిగడ్డల సగటు ధర నవంబర్‌లో రూ 41గా ఉండగా, అంతకుముందు నెలలో కిలోకు రూ 37.4గా నమోదైంది.
సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కూరగాయల రిటైల్ ధరలు ఏకంగా 14.2 శాతం పెరిగింది. కూరగాయల రిటైల్ ధరలు పెరుగుతుండగా హోల్‌సేల్ ధరలు కూడా గత నెలతో పోలిస్తే 32 శాతం ఎగబాకాయి. అకాల వర్షాలతో పాటు ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయాలు పెరగడంతో కూరగాయల ధరలు భగ్గుమన్నాయని కేర్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది.