Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహణ లోపాలు, కేవైసీలో అవకతవకల నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనాటే మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ పేటీఎం పేమెంట్ బ్యాంక్‌పై నిషేధం విధించిందని.. ఇందులో ఆర్బీఐ మనీలాండరింగ్ ఆరోపణలు చేసినా సీబీఐ ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్య తీసుకున్న తర్వాత, ఆ కంపెనీపై మనీలాండరింగ్‌కు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకుందని ఆమె నిలదీశారు. రాజకీయ నేతలపై 95శాతం కేసులున్నాయని.. దీనిపై ఈడీ సంతృప్తిగా ఉందా? అంటూ ప్రశ్నించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యూజర్ల డేటా సురక్షితంగా ఉందా? బీజేపీతో షేర్ చేయడం లేదా? అన్నారు. ఇన్ని ఉల్లంఘనలు జరిగినా పేటీఎం బ్యాంక్‌కు ఇంత సుదీర్ఘంగా సడలింపులు ఎందుకు ఇచ్చారన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకుంది.. పీఎం కేర్ ఫండ్, బీజేపీకి ఎంత పేటీఎం విరాళం ఇచ్చిందని నిలదీశారు.
ఇదిలా ఉండగా.. ఆర్బీఐ పేటీఎం బ్యాంక్‌లో రూ.వందలకోట్ల లావాదేవీలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ నిషేధం నేపథ్యంలో పేటీఎం షేర్లు 40శాతం నష్టపోయాయి. పేటీఎం కేవైసీలో రిజర్వ్ బ్యాంక్ అనేక అవకతవకలను గుర్తించింది. లక్షల మంది కస్టమర్ల కేవైసీని పేటీఎం చేయలేదని ఆర్బీఐ పేర్కొంది. లక్షల ఖాతాల పాన్ ధ్రువీకరణ జరుగలేదని.. చాలా మంది కస్టమర్లకు ఒకే పాన్ కార్డ్ ఉపయోగించిందని.. రిజర్వ్ బ్యాంకుకు ఆ సంస్థ పలుమార్లు తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా ఆరోపించింది.