Layoffs | న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని జపిస్తున్న టెక్ కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకుంటున్నాయి. 2024 ప్రథమార్థంలో లేఆఫ్‌ల ద్వారా వేల మంది టెకీలపై వేటు వేసిన పలు కంపెనీలు ద్వితీయార్థంలోనూ అదే పరంపరను కొనసాగిస్తున్నాయి. ఈ జాబితాలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్, సిస్కో, డెల్, ఇంటెల్, క్వాల్కమ్, నార్త్‌వోల్ట్ లాంటి బడా కంపెనీలతోపాటు డోజీ, ఉయ్ ట్రాన్స్ఫర్ లాంటి చిన్నచిన్న స్టార్టప్ కంపెనీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 511 కంపెనీల్లో 1,39,206 మంది టెకీలు ఉద్యోగాలను కోల్పోయినట్టు ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 4 వేల మంది ఉద్యోగులపై వేటు వేసిన సిస్కో.. రెండో విడతగా తమ మొత్తం సిబ్బందిలో 7% (దాదాపు 5,600 మంది) ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆగస్టులో ప్రకటించింది. ఈ ఏడాది ఆరంభంలో పలువురు ఉద్యోగులను తొలగించిన ఐబీఎం సంస్థ.. తాజా విడతలో ప్రధానంగా సీనియర్ ప్రోగ్రామర్లతోపాటు సేల్స్, సపోర్ట్ సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగమైన ‘ఎక్స్‌బాక్స్’తోపాటు కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో 650 ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించగా.. స్మార్ట్‌ఫోన్ చిప్‌ల తయారీలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న ‘క్వాల్కమ్’ త్వరలో శాన్‌డిగోలో 226 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. ఇదేవిధంగా స్వీడన్లో దాదాపు 1,600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తున్నట్టు బ్యాటరీల తయారీ సంస్థ నార్త్‌వోల్ట్ గత నెలలో ప్రకటించింది.