Ghaziabad | ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో చిన్నారి ముఖంపై ఏకంగా 60కి పైగా కుట్లు పడ్డాయి. ఈ హృదయవిదారకర ఘటన ఘాజియాబాద్‌లో చోటు చేసుకుంది.
బెహ్రంపూర్లోని విజయ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏడాదిన్నర వయసు గల బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీధి కుక్క బాలిక ముఖంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి… కుక్క కాటుకు ఇంజక్షన్ వేయించారు.
అనంతరం ఈ ఘటన ఘాజియాబాద్ ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లగా.. పసికందును వెంటనే జిల్లా ఎంఎంజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి శస్త్రచికిత్స చేశారు. ఘటనపై ఆసుపత్రి వైద్యుడు మనోజ్ కుమార్ ఛతుర్వేది మాట్లాడుతూ… ‘శస్త్రచికిత్స అనంతరం చిన్నారిని పిల్లల వార్డుకు షిఫ్ట్ చేశాం. పాప ముఖంపై 60 నుంచి 70 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం వైద్యం అందిస్తున్నాం. బాలిక కోలుకుంటోంది’ అని వివరించారు.
వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడుతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికిమొన్న గ్రేటర్ నోయిడాలో కుక్కలదాడిలో ఓ చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఘాజియాబాద్‌లో 11 ఏళ్ల బాలిక వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకుంది. ఇప్పుడు కుక్క దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.