శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గామ్ (Kulgam) జిల్లాలోని ఖండిపొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టును భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఖండిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని పోలీసులు తెలిపారు. అతడు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థకు చెందిన టెర్రరిస్టుగా గుర్తించామని వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
కాగా, బారాముల్లా జిల్లాలోలోని నెహల్పొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయీబాకు చెందిన ఇష్రాద్ అహ్మద్ మీర్, జాహిద్ బషీర్‌గా గుర్తించామన్నారు. వారివద్ద రెండు చైనా తుపాకులు, 18 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగజైన్లు, ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.