Jamili Elections | హైదరాబాద్, డిసెంబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అసలు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్‌సభ తొలిసారిగా సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ ఇదివరకే సిఫారసు చేసింది. ఈ క్రమంలో రాజ్యాంగంలో కొత్తగా పొందుపర్చబోతున్న ఆర్టికల్ 82ఏలోని తొలి క్లాజు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని కచ్చితత్వంతో చెప్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జమిలి తాజా బిల్లులో పేర్కొన్న విషయాలను బట్టి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సమావేశమయ్యే తొలి లోక్‌సభ సమావేశంలో ఆర్టికల్ 82ఏను రాష్ట్రపతి నోటిఫై చేయనున్నట్టు వెల్లడించారు. ఆ రోజునే అపాయింటెడ్ డేగా తీసుకొంటారు. 18వ లోక్‌సభ ఎన్నికలు గత మే-జూన్‌లో జరిగిపోయాయి. గత జూన్‌లోనే తొలిసారిగా లోక్‌సభ సమావేశం పూర్తైంది.
ఈ లెక్కన 2029లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడే తొలి లోక్‌సభ సమావేశంలోనే రాష్ట్రపతి ఆర్టికల్ 82ఏను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్ నోటిఫై అయ్యాకే.. అంటే ఆ రోజు నుంచి ఐదేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాతనే లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సదరు క్లాజులో పేర్కొన్నారు. ఈ లెక్కన 2034లోనే జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్టు బిల్లు స్పష్టం చేస్తున్నదని నిపుణులు చెప్తున్నారు.