ఇంఫాల్, మార్చి 8: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింస రాజుకుంది. ప్రజల స్వేచ్ఛా సంచారం ప్రారంభమైన తొలి రోజే ఘర్షణలు రేగాయి. కుకీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాంగ్పోక్పీ జిల్లాలో కుకీ నిరసనకారులు పలుచోట్ల భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆర్టీసీ బస్సులను నడపాల్సి వచ్చింది. కాంగ్పోక్పీ జిల్లాలో కుకీ నిరసనకారులు రెండో నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించి ప్రైవేట్ వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలు వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన ప్రజల స్వేచ్ఛా సంచారాన్ని వ్యతిరేకించారు. మైతీలకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ వారి శాంతి ర్యాలీనీ నిరసనకారులు వ్యతిరేకించారు. పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్న కుకీలు తమకు భూములపై హక్కులు కావాలని, రాజకీయ ప్రాతినిధ్యం కావాలని మే 2023 నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైతీ గిరిజనులతో వారు ఘర్షణ పడుతున్నారు. ఈ కారణంగా జరిగిన హింసాకాండలో ఇప్పటివరకు 250 మంది మృతి చెందారు. 50 వేల మంది స్వస్థలాలను విడిచిపెట్టారు.